20, సెప్టెంబర్ 2014, శనివారం

మరణం నా జన్మ హక్కు

మరణం నా జన్మ హక్కు 

కలుస్తారో .. కల గంటారో
కాలు జారుతారో 
అంతా మీ ఇష్టం  

చిలకప్రశ్న వేస్తారో ..జాతకం చూస్తారో 
అండ పిండానికి అంకురార్పణ చేస్తారో 
అంతా మీ ఇష్టం  

పిండనిర్ధారణ వరకూ వస్తారో 
మందు బిళ్ళతో 
పిండ ప్రదానం చేస్తారో 
అంతా మీ ఇష్టం  

నడక, నడత నేర్పుతారో 
నరకం చూపుతారో 
అంతా మీ ఇష్టం 

చదివిస్తారో 
చట్టుబండలు చేస్తారో 
మీ స్వయం నిర్ణయాధికారం 

ప్రేమిస్తారో .. ద్వేషిస్తారో 
లింగ భేదం చూపిస్తారో 
మీ విచక్షణాదికారం  

నెలలో మూడు రోజుల వెలికి
ప్రకృతి సిద్ధమైన లైసెన్సు 
ఆశీర్వదిస్తారో ..ఆంక్షలు విదిస్తారో 
అంతా మీ ఇష్టం 

పెళ్లి చూపుల సంతకు తరలిస్తారో
 ప్రేమించినోడి  చెంతకు చేరుస్తారో 
అంతా మీ ఇష్టం  

కట్నానికి బలిస్తారో .. వేధింపులతో వేటేస్తారో 
అనుమానాలతో అంతమొందిస్తారో 
అంతా మీ ఇష్టం 

ఆడమ్ అండ్ ఈవ్ 
ఎవడ్రా  మిమ్మల్ని కలవనిచ్చింది 
ఒరే ఆడమ్ .. ఆడోళ్ళ ఉసురు తీశావ్ గదరా 


కండోమ్ తో ఉరేసి .. టాబ్లెట్లతో చిదిమేసి 
కత్తులతో కోసేసి .. కళ్ళు తెరవక ముందే 
కారుణ్య మరణం ప్రసాదిస్తున్నారు 

మొండిగా కళ్ళు తెరిస్తే 
నర్సరీ నుంచి నడవలేని ముసలమ్మా వరకూ 
కన్ను మూయాల్సిందే 
కామాంధులకు బలి  కావాల్సిందే 

అగ్గిపుల్ల.. నైలాన్ తాడు 
పురుగు మందు.. నేల బావి 
తలదిండు.. పడక మంచం 
కత్తి .. యాసిడ్ 
నన్ను చంపేందుకు ఎన్ని ఆయుధాలు 
మరణం నా జన్మ హక్కు 

............... శ్రీచమన్ (20-09-2014)




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి