7, ఫిబ్రవరి 2011, సోమవారం

మరణ వాంగ్మూలం

నింగీ నేల
మన్నూ మిన్నూ మధ్య
మెతుకు కోసం .. బతుకు కోసం
ఆశ చావని నేను
రాస్తున్నా మరణ వాంగ్మూలం

నేను అన్న దాతను కాను
నా తల రాత కూడా రాసుకోలేని నిరక్షరాస్యుడిని

నాదో వ్యాపారం
అన్నీ కొంటాను ..
చివరికి అమ్ముకున్దామనుకుంటాను
విత్తనాలు చల్లి రూపాయలేరుకున్దామనే ..


నీరు నిప్పైయ్యింది
పురుగు పోటు.. కరువు కాటు
అన్నింటినీ తట్టుకుంటే
దళారీకి ఫలహారం

ఎప్పుడూ
చీడ పీడల కలలు
వానగాలుల భయాలు
వడగాడ్పుల పలవరింతలు

చేను మేసిన కంచె
చెరువును కొట్టేసిన గట్టు
శ్వాస ఆపిన ఆశ
మందునూ తినేసిన పురుగులు

అదిగో క్రిమిసంహారక మందు
ఇదిగో దాని రసీదు
ఇదే నా శవ పంచనామా
నా చావుకు ఎవరూ కారణం కాదు

యుద్ధభూమిలో నేలకొరిగిన సైనికుడిలా
జల్విలయానికి బురద కరిచిన పంట చేల నుంచి ..
ప్రత్యక్ష ప్రసారం ...

మీరిప్పుడు చూస్తున్నవిజువల్స్
ఆత్మహత్య చేసుకున్న
కౌలురైతు ఇంటినుంచి
మన చానల్కే ప్రత్యేకం

రోజూ చచ్చేవాడిని
ఎవడో పరామర్సిస్తున్నాక్కడ
దేశంలో ఎక్కడా లేని చావు ప్యాకేజి
వ్యవసాయం దండగని ఎవడన్నాడు .. పండగ చేసుకో ..


శ్రిచమన్- 9490638222

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి